టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితా రెడీ...15 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ సిద్ధం...

Update: 2018-09-05 03:31 GMT

ముందస్తు ఎన్నికల రణభేరి మోగిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ముందస్తుగానే ప్రకటించబోతోంది. గులాబీ బాస్ కేసీఆర్ గతంలో చెప్పినట్లే ఈ నెలలో అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో శాసన సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెలలో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఆయన చెప్పినట్లే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమైనట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. దాదాపు 15మందితో ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించే ప్రజల ఆశీర్వాద సభలో కేసీఆర్ 15 మంది పేర్లు ప్రకటిస్తారని చెబుతున్నారు.

హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభ నుంచే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ సభలోనే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని అంటున్నారు. పైగా 7వ తేదీన చివరి శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజు మంచి రోజని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే హుస్నాబాద్‌లో జరిగే సభను అభ్యర్ధుల పేర్లు ప్రకటించే వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి జాబితాలో ఉన్న 15 మందిలో ఎక్కువగా సిట్టింగ్‌ల పేర్లు ఉండొచ్చని అంచనా. మరి 15 మంది అభ్యర్థులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారా అనే సస్పెన్స్ నెలకొంది.

మరోవైపు కేసీఆర్ ప్రకటనకు ముందే నిజామాబాద్‌ ఎంపీ కవిత జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎవరో ప్రకటించేశారు. జగిత్యాలలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవిత జగిత్యాల టీఆర్ఎస్ ఇంచార్జ్  సంజయ్‌ను కాబోయే ఎమ్మెల్యే అంటూ సంబోధించారు. దీంతో జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ అని కవిత అనధికారికంగా ప్రకటించినట్లయ్యింది.

Similar News