యుద్ధానికి వెళ్తున్నా.. ఆశీర్వదించండి: కేసీఆర్

Update: 2018-09-08 04:08 GMT

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారభేరీని మోగించారు. అచ్చొచ్చిన హుస్నాబాద్‌ వేదికగా సమరశంఖం పూరించారు. సెంటిమెంట్‌ను రగిల్చుతూ మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ముందస్తుకు ప్రతిపక్షమే కారణమన్న ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

యుద్ధానికి బయల్దేరే ముందు కేసీఆర్ సమరశంఖం పూరించారు. విజయం సాధించేలా ఆశీర్వదించాలని హుస్నాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తపల్లి వీరన్న కొలువుదీరిన హుస్నాబాద్‌ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే తనకు అపజయమే ఉండదని సెంటిమెంట్‌ను రగిల్చారు. గెలుపుకు ప్రాణం పోసిన హుస్నాబాద్‌ను మరోసారి నెత్తినెత్తుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీని చీల్చిచెండాడిన కేసీఆర్‌ ముందస్తుకు కారణం కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికలకు వెళ్తున్నట్లు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయని  21.96 శాతం అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. 

ఉద్యమం నుంచి తాను మాట తప్పింది మడమ తిప్పింది లేదని ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ముందస్తుకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో కరెంటు కష్టాలు తీర్చామన్న ఆయన ఎలాంటి సమస్యలు లేకుండా తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతుందన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించి ఆకుపచ్చ తెలంగాణ చూడాలన్నదే తన చిరకాల కోరిక అని సభ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్న కేసీఆర్ తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. ఉడుతల సతీశ్‌ను ఎన్నుకోవాలని హుస్నాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

Similar News