కొమురం పులి సమరోత్సాహం... పవన్‌ స్ట్రాటెజీ ఏంటి?

Update: 2018-05-18 05:27 GMT

జనసేనుడు రాజకీయ రణధ్వని చేస్తానంటున్నాడు. కొమురం పులి... ఇక ప్రత్యక్షంగా జనం మధ్యే ఉంటూ సమరం పులిగా మారుతానని చెబుతున్నాడు. ఉత్తరాంధ్ర నుంచి ఉరుముకుంటూ... రాష్ట్రాన్ని మెరుపు వేగంతో చుట్టొస్తానంటున్నాడు. సాధారణ ఎన్నికలు ఏడాదే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాఅంటే 11 నెలలుగానే చెప్పుకుంటున్నాం. నాలుగేళ్లుగా లేని ఉత్సాహాన్ని ఈ పదకొండు నెలల కాలంలోనే రెట్టిస్తానంటున్నాడు జనసేనాని. పవన్‌కల్యాణ్‌ దగ్గరున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రాటజీ ఏంటి? రాజకీయ చదరంగంలో ప్రజారాజ్యంతో నేర్చుకున్న గుణపాఠాన్ని... జనసేనాధిపతిగా ప్రత్యర్థులకు ఇచ్చే ఝలక్‌ ఏంటి? మొత్తంగా పవన్‌ ఆలోచనేంటి? రాజకీయ ఎత్తుగడలేంటి? 

ప్రత్యర్థుల గాలి మాటలకు ఇక దిమ్మతిరిగే కౌంటర్‌ ఇస్తానంటున్నాడు పవన్‌కల్యాణ్‌. టైమ్‌పాస్‌ పాలిటిక్స్‌... పార్ట్‌టైమ్‌ లీడరన్న ఆపవాదును తుడిచి పెట్టేస్తూ... ఉత్తరాంధ్ర నుంచి ఉరిమే ఉత్సాహంతో రాజకీయ కదనరంగంలో అడుగుపెడుతానని ప్రకటించాడు. ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారుతానన్న జనసేనాని... ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతోంది జనసైన్యం. పాలిటిక్స్‌లో ఆరడుగుల బుల్లెట్‌ దూసుకుపోతాడని సంబరపడుతోంది. ఇక రాజ‌కీయాలే అనుకుంటే ఇక అన్నీ వ‌దిలేస్తానన్న మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారుతానని ఉబ్బితబ్బిబ్బవుతుంది. 

తాను సైలెంటుగా ఉన్నానంటే ఏ ప‌నీ చేయ‌లేద‌ని, చేయలేనని కాదన్న పవన్‌లో ఇంకో కోణం ఉందంటారు జనసైనికులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేంద్రబిందువు అవుతాడని చెబుతున్నారు. పార్ట్‌టైమ్‌గా ఉంటేనే ఇలా ఉంటే... ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో పవన్‌కల్యాణ్‌ ఇక రుచి చూపిస్తాడని హెచ్చరిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌.... ప్రశ్నించే గొంతుక అంటోంది జనసైన్యం. ఎవరినైనా నిగ్గదీసి అడిగే ధైర్యమంటూ భుజాలు చరుచుకుంటుంది. జనసేన పెట్టినప్పుడు, పార్టీ పుట్టినప్పుడు పవన్ ఆవేశం చూసిన తాము తెలుగు రాజకీయాల్లో కేంద్రబిందువు అవుతారని తామెప్పుడో అనుకున్నామంటున్నారు అభిమానులు. అందుకే ఉత్తరాంధ్ర నుంచి యాత్రకు శ్రీకారం చుడుతున్నాడు... ఇక చూడండి అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్‌ విసురుతున్నారు. 

224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో 38 అంటే 38 సీట్లు మాత్రమే సాధించిన జేడీఎస్ సీఎం పదవిని దక్కించుకునే అవకాశాన్ని కొట్టేసింది. అది రావడం రాకపోవడం సంగతి పక్కనపెడితే... కనీసం అంతవరకైనా వెళ్లి.. రాజకీయంగా అలజడి సృష్టించిందన్న సంగతి జనసేనలో కొత్త ఆశలకు కేంద్రమైంది. తెలుగుదేశం, వైసీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా ఎందుకు ఎదగకూడదన్న ఆలోచన పవన్‌లో, ఆయన అనుచరుల్లో మొదలైందన్న విషయం స్పష్టమవుతోంది. 

2014లోనే ఒక శక్తిగా మారే సత్తా పవన్‌కు ఉన్నా... అది బయటకు రాలేకపోయిందంటున్నారు అభిమానులు. సీజనల్ నాయకుడని ఒకరు.. పార్ట్‌టైమ్ లీడర్ అని మరొకరు... ఇలా రకరకాల కామెంట్లు వచ్చినా... పవన్ ఒక నిర్దిష్ట ఆలోచనతోనే ముందుకు వెళ్లారు. ఇటీవలే జనసేన గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తాజాగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. వివిధ జిల్లాల సమస్యల మీద స్పందిస్తున్నారు. అదే ఉత్తరాంధ్ర యాత్రకు కారణమైందంటున్నారు 

ఎన్నికల సమయానికి అంత మారుతుంది. ఇప్పుడేది ఊహిస్తామో అది జరకగపోవచ్చు. ఊహించనది అనూహ్యంగా ముందుకు రావచ్చు. అప్పడున్న పరిస్థితుల ప్రకారం పరిణామాలు మారుతాయి. సమీకరణలు మారుతాయి. 2019 లక్ష్యంగా జనసేనాని సంధించిన విజయాస్త్రం.. పవన్‌కల్యాణ్‌‌ను పీఠమెక్కిస్తుందా? రాజకీయంగా క్రియాశీలకంగా మారుస్తుందా? దీనికి సమాధానం చెప్పేది కాలమొక్కటే. 

Similar News