శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించిన పవన్ కల్యాణ్

Update: 2018-04-14 09:38 GMT

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన పోరాటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జమ్మూలోని ఆసిఫాపై జరిగిన అత్యాచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని.. అలాంటి వారికి తమలాంటి వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.. కానీ టీవీ చర్చలకు వెళ్ళటం సరైంది కాదని సూచించారు. గతంలో షూటింగ్ సమయంలో చాలా సంఘటనలు జరిగాయని... తాను కూడా చాలా సందర్భాలలో ఇలాంటి వాటిని అడ్డుకున్నానని పవన్ స్పష్టం చేశారు.

మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఏదైనా దారుణం జరిగితే కానీ మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News