ఆ పాటను మార్చే ప్రసక్తే లేదు

Update: 2018-02-15 05:51 GMT

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ చిత్రం 'ఒరు ఆధార్ లవ్' సినిమాలోని 'మాణిక్య మలయార పూవీ' పాట సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని దర్శకుడు ఒమర్ లులూ తెలిపారు. ఈ పాటను సీఎమ్‌జే జప్పర్ రాశారని.. అందులో ఏ మతాన్ని కించపరిచే అభ్యంతర వ్యాఖ్యలు లేవని ఆయన అన్నారు. ఉత్తర కేరళలో జరిగే ప్రతి పెళ్లిలోనూ ఈ పాటను పాడుకుంటారని.. ఆ ప్రాంతంలోని ముస్లింలు కూడా 1978 నుంచి ఈ పాటను పాడుతూ వస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచి అక్కడి ముస్లింలకు లేని అభ్యంతరం.. ఇప్పుడెందుకంటూ ఆయన ప్రశ్నించారు.

ఒకవేళ ఇందులో అంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే అది సెన్సార్ చూసుకుంటుందని.. కానీ ఈ పాటలోని సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చనని స్పష్టం చేశారు. కావాలంటే మ్యూజిక్‌ను మాత్రమే మార్చగలమని చెప్పారు. అలాగే ఈ విషయంలో ప్రియా వారియర్‌కు ఎలాంటి సంబంధం లేదని.. దర్శకుడిగా తాను చెప్పినట్లుగా ఆమె చేసిందని తెలిపారు. అయితే ఈ పాట తమ మతస్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్‌లో కొంతమంది ముస్లింలు ప్రియా వారియర్‌పై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.

Similar News