పవన్‌పై జగన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన నాగబాబు

Update: 2018-07-27 10:24 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై నాగబాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ పార్టీ అధినేతగా కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని అన్నారు. పార్టీలో మిగతా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడినా, అర్థం లేకుండా మాట్లాడినా ఇబ్బంది లేదని, కానీ పార్టీ అధినేత నోరు జారవద్దని, జాగ్రత్తగా ఉండాలని (జాగ్రత్తగా మాట్లాడాలని) అన్నారు. జగన్ మాట జారారని చెప్పారు. సరైన అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. రాజకీయంగా తన సోదరుడిని ఎదుర్కొనే దమ్ము లేకపోవడంతోనే  వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.  తన  సోదరుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. పర్సనల్ లైఫ్‌ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకొనే దమ్మున్న వ్యక్తి  తన సోదరుడని పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చెప్పారు.

సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో సినిమాలను వదులుకొని ప్రజా సేవ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన చెప్పారు.  తాము చెప్పిన మాటలను కూడ పవన్ వినలేదన్నారు.  తప్పులు చేస్తే ఒప్పుకొనే దమ్ము పవన్ కు ఉందన్నారు. కానీ, తప్పులు చేస్తే ఒప్పుకొనే దమ్ము మీకు ఉందా అని పవన్ ను విమర్శిస్తున్న పార్టీల నేతలను నాగబాబు ప్రశ్నించారు. పవన్ వివాహానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని వ్యాఖ్యానించారు. పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు. చట్టబద్ధంగా విడిపోయి.. న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

పెళ్లిళ్లు చేసుకుని అక్రమ సంబంధాలు నడిపితే తప్పు లేదా అని వ్యాఖ్యానించారు. పవన్‌ను విమర్శించడం వెనుక పొలిటికల్ అజెండా ఉందన్నారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించడానికి అవకాశం లేకపోవడంతో వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారని నాగబాబు చెప్పారు. వైవాహిక జీవితంలో కూడా పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లే అలా మాట్లాడుతున్నారన్నారు. కల్యాణ్‌ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా మారుతున్నాడన్నారు.

Similar News