ముందుగానే నైరుతి రుతుపవనాలు

Update: 2018-04-11 09:30 GMT

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సానుకూల సంకేతాలు వస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు వేసవి ఆరంభంలోనే క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించడం, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి పరిణామాలు ముందస్తు రుతుపవనాలకు దోహదం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. 

రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది వారం రోజుల ముందుగానే కేరళకు చేరుకుంటాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి నీటి ఆవిరి కలిగిన మేఘాలు భూమధ్యరేఖ దాటి ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడనాలు బలంగా ఉన్నాయి. ఇవి దక్షిణం వైపు నుంచి తేమ గాలులతో తూర్పు, పశ్చిమతీరాలకు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎండాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించేందుకు దోహదపడే పశ్చిమ ఆటంకాలు ఉత్తరం వైపునకు కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే ఎల్‌నినో ఏర్పడి వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. అదే ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే లానినా పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రుతుపవనాలకు అనుకూలమన్నమాట. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల లానినా పరిస్థితులు ఏర్పడి జూన్‌ దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నైరుతి రుతుపవనాలు ముందస్తు ఆగమనానికి అనుకూల పరిణామమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్‌ మొదటితేదీకి 5 నుంచి 8 రోజుల ముందుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే వీలుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ప్రకటించింది. ఇప్పుడు ముందస్తు రుతుపవనాలతో వాతావరణం త్వరగానే చల్లబడుతుందని అంచనావేస్తున్నారు.

Similar News