రణక్షేత్రంలోనే కాదు జలవిలయంలోనూ సైన్యం సాయం

Update: 2018-08-20 09:05 GMT

యుద్ధరంగంలో శతృవులను మట్టికరిపించే యోధులు వారు. సరిహద్దు వెంబడి పహారా కాస్తూ దేశాన్ని రక్షించే వీరులు వారు. దేశ ప్రజలంతా సుఖంగా నిద్రించేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టే ధీరులు వారు. ఇవాళ యావత్‌ దేశం భద్రంగా ఉందంటే సాహసానికి సిద్దంగా ఉన్న సైన్యం వల్లే. అలాంటి సైన్యం రణక్షేత్రంలోనే కాదు ప్రకృతి విపత్తుల్లో కూడా తమ సత్తా చాటుతోంది. మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది. ఇప్పుడు జల ప్రళయంలో చిక్కుకున్న కేరళలోనూ సైన్యం మరువలేని సాయం చేస్తోంది.

దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు ముంచుకొచ్చినా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాల్సి వచ్చినా అందరికి గుర్తొచ్చేది ఆ జవాన్లే. రణక్షేత్రంలోనే కాదు ప్రకృతి ప్రకోపించినా వారే ముందుంటారు. మొన్నటి ఉత్తరాఖండ్‌, నిన్నటి చెన్నై వరదలతో పాటు ఇవాళ్టి కన్నీటితో నిండిన కేరళను ఆదుకుంటున్నదీ ఆ జవాన్లే. ఆపదలో ఆపన్న హస్తం అందిస్తూ నిరాశ్రయులైన వారిలో ధైర్యం నింపుతున్నారు.

రణక్షేత్రంలో ఎదురుపడ్డ వారిని నిలువరించే జవాన్లు ప్రకృతి విపత్తును ఎదురొడ్డి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. కేరళలో మరోసారి వారు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. జలవిలయంలో బిక్కు బిక్కుమంటున్న వారిని ప్రాణాలకు ఎదురొడ్డి కాపాడారు. వరదలో తమ ప్రాణాలు పోయినట్టే అని అనుకున్న సమయంలో అప్పటికప్పుడే ప్రత్యక్షమై వారికి ఆపన్న హస్తం అందించారు. బిల్డింగులపై, చెట్లపై ఉండి ఆసరా కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనిచ్చి కాపాడారు. 

కేరళ సహాయక చర్యల్లో ఓ నిండు గర్బిణిని రక్షించడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఓ మనిషికి పునర్జన్మనివ్వడమే కాదు ఆమె పండంటి బిడ్డకు  జన్మనివ్వడంలోని ఆర్మీసాయం మరువలేని. అంతే కాదు ఇండ్లు కూలినా, బ్రిడ్జిలు పడిపోయినా అప్పటికప్పుడు తాత్కాలిక నిర్మాణాలు చేపడుతూ కొండంత సాయం అందిస్తున్నారు.

ప్రకృతి విలయం ఎంతలా ఉన్నా చేయి చాచిన వారికి కూడా ధైర్యాన్నిచ్చే ఆర్మీ ఆపదలో ఉన్నవారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మరుభూమిలో మానవత్వాన్ని చూపించి చావుబతుకుల్లో ఉన్నవారికి సాంత్వన కలిగిస్తుంది. వారికి కొత్త బతుకునిస్తుంది. 

అవును సైన్యానికి ఏదైనా ఎక్కడైనా అది యుద్ధరంగమే. అక్కడ విజయం సాధించడమే వారి లక్ష్యం. మానవత్వంతోనా లేక మండే ఆవేశంతోనా అన్నదే తేడా. అందుకే భారతీయులకు ఏ కష్టమొచ్చినా అందరి చూపు జవాన్ల వైపే. ఏ ఆపద వచ్చినా.. సైన్యం వచ్చి కాపాడుతుందని భరోసానే. అందుకే కేరళలో సాయం అందిస్తున్న  ప్రతీ ఒక్క సైనికుడికి హెచ్ఎంటీవీ చెబుతోంది జై జవాన్‌.

Similar News