కేసీఆర్ మొక్కు చెల్లించిన ముక్కు పుడకలో 57 వజ్రాలు

Update: 2018-06-28 08:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విజయవాడ కనకదుర్గమ్మను సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కేసీఆర్‌కు ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేకంగా చేయించిన ముక్కుపుడకను.. తలపై పెట్టుకుని మేళతాళాల మధ్య.. ఆలయంలోకి ప్రవేశించారు. తర్వాత ముక్కుపుడకను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు.. కేసీఆర్‌ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. 

అంతకుముందు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌ను.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆ‍యన.. గేట్ వే హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటి గంట సమయంలో కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. కనకదుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పిస్తామన్న మొక్కును.. కేసీఆర్ తీర్చుకున్నారు. అర్ధచంద్రాకారంలో ఉన్న ముక్కుపుడక మధ్యలో పాలపిట్ట, పచ్చరాళ్లు, నీలిరంగు రాళ్లతో పాటు.. 57 వజ్రాలు పొదిగారు. ప్రత్యేకంగా ఆకర్షించిన ముక్కుపుడకను అమ్మవారికి అందజేశారు. కేసీఆర్ వెంట.. ఆ‍యన సతీమణి శోభ, కోడలు, మనువలు, పలువురు బంధువులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Similar News