కరుణ వెర్సస్‌ జయ...నిండు సభలో దుశ్శాసన పర్వం

Update: 2018-08-08 06:32 GMT

కరుణానిధి-జయలలిత. తమిళ రాజకీయాల్లో బద్ద శత్రువులు. ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకున్న నాయకులు. వాళ్లిద్దరూ అసెంబ్లీలో ఉన్నారంటే, అదొక యుద్ధం. శాసన సభ రణక్షేత్రాన్ని తలపిస్తుంది. మాటల తూటాలు, ఎత్తుకుపైఎత్తులు, వాగ్దానాలపై వాగ్భాణాలు. తమిళ రాజకీయాల్లో ఇద్దరి శత్రుత్వం ఒక చెరగని పేజి. ఇద్దరి రాజకీయ ప్రస్థానంలో, ఒక ఘటన, ఒక ఘట్టం, ఒక బ్లాక్‌ పేజీని, ఇద్దరికీ చేదు జ్ణాపకాన్ని ముద్రించింది. 

1989...తమిళనాడు అసెంబ్లీ...శాసన సభలో దుశ్శాసన పర్వం...తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లోనే ఒక చేదు జ్నాపకమిది. కరుణానిధి, జయలలితల మధ్య వైరం, దుశ్శాసనపర్వానికి దిగజారింది. అసెంబ్లీ సాక్షిగా, కరుణానిధి సమక్షంలో, డీఎంకే సభ్యులు, జయలలిత పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. ఆమె చీరను లాగి, నిండు సభలో అవమానికి గురి చేశారు. అది కరుణానిధి రాజకీయంలో మాయని మచ్చ. అయితే, అధికారంలోకి వచ్చిన రోజే, ప్రతీకారం తీర్చుకున్నారు జయలలిత. ఓ కేసులో అర్థరాత్రి కరుణానిధి ఇంటికి పోలీసులను పంపి, బలవంతంగా అరెస్టు చేయించారు.

కరుణానిధి, జయ ప్రతీకార ఘట్టం, చెరగని చేదు జ్ణాపకంలా మిగిలిపోయింది. ఆ తర్వాత కూడా ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. పోటీపడి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టారు. వైరంతోనే జాతీయ పార్టీలకు మద్దతిచ్చారు. కేంద్రంలో చక్రంతిప్పి, సీబీఐని ఎగదోసి, ఒకరిని, ఒకరు ఇరకాటంలోకి నెట్టుకున్నారు. ఇక ఇద్దరూ అసెంబ్లీలో ఉంటే, అదొక ప్రత్యక్ష యుద్ధం. వీక్షకులకు ఉత్కంఠరేపే రణక్షేత్రం. పదునైన ప్రసంగాలతో దుమ్మెత్తిపోసుకుంటారు. వాగ్భాణాలు సంధించుకుంటారు. కానీ ఇద్దరు నాయకులు, ఇప్పడు కాలం చేశారు. వారి రాజకీయాలు, వైరాలు చరిత్ర పుటలయ్యాయి.

Similar News