తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్...

Update: 2018-08-20 03:54 GMT

ఎడతెరపి లేని వర్షాలతో తడిసిముద్దైన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనంతో వచ్చే రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. 

వచ్చే 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఏపీలో రెండు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సోమవారం సాయంత్రంలోగా అది బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనికి తోడు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొందని దీంతో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

మరోవైపు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరులోని తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో నీటి మట్టం 348 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. తమ్మిలేరు వరద ఉధృతి వల్ల కైకలూరు, ఏలూరు మధ్య రాకపోకలు నిలిచాయి. మరోవైపు భద్రాద్రి దగ్గర వరద తగ్గుముఖం పట్టగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌ అన్ని గేట్లను ఎత్తేసి సముద్రంలోకి నీటిని వదిలారు. 

మరోవైపు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణాజిల్లాలోనూ రెండు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని అలలు 4 మీటర్ల వరకు ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. 

Similar News