ఏడేళ్ల క్రితమే కేరళను హెచ్చరించిన గాడ్గిల్‌...ఇప్పుడు కేరళ..తర్వాత గోవా..?

Update: 2018-08-20 03:40 GMT

గత వందేళ్లలో ఎన్నడూలేని జల ప్రళయాన్ని కేరళ చవిచూసింది. వరుణుడి ధాటికి వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ స్థాయి వర్షాలు గతంలోనూ కురిసినా ఇంతపెద్దన వరదలు రావడానికి మాత్రం స్వయంకృతాపరాధమేనంటున్నారు పర్యావరణవేత్తలు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ప్రతి రాష్ట్రం మరో కేరళ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 

కేరళలో ప్రస్తుతం తలెత్తిన ప్రకృతి విపత్తుకు మానవ చర్యలే కారణమని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, స్టోన్‌ క్రషర్ పరిశ్రమల వల్లే ఈ భారీ విపత్తు సంబవించిందని అభిప్రాయపడ్డారు. కేరళలో అనేక ప్రాంతాలను పర్యావరణ సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించాలని 2011లో డబ్ల్యూజీఈఈపీ నివేదిక ఇచ్చినా ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని గుర్తుచేశారు. కేరళలో ప్రస్తుతం కురిసిన వర్షాలు ఇంతకుముందు కూడా కురిశాయని, కానీ ఈ స్థాయిలో వరదలు రావడానికి మాత్రం నదీ పరివాహన ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు, స్టోన్ క్రషింగ్‌ క్వారీలే కారణమన్నారు. కేరళ జల విలయానికి ముమ్మాటికీ మానవ చర్యలే కారణమంటున్నారు.

కేరళకు ఇలాంటి పరిస్థితి వస్తుందని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏడేళ్ల కిందటే హెచ్చరించిన పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ఇప్పుడు మరో వార్నింగ్ ఇచ్చారు. పర్యావరణపరంగా తగిన చర్యలు ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ఇప్పుడు కేరళకు పట్టిన గతే గోవాకూ పడుతుందని గాడ్గిల్‌ హెచ్చరిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా పర్యావరణపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే భవిష్యత్‌లో ఇలాంటి కష్టాలు, ముప్పు తప్పవని చెబుతున్నారు.

అంతులేని లాభాపేక్ష కారణంగానే ఎవరూ పర్యావరణంపై దృష్టిపెట్టడం లేదని, అందువల్లే ఇలాంటి భారీ విపత్తులు సంబవిస్తున్నాయని గాడ్గిల్‌ చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదని, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను కూడా సరిగా పనిచేయనివ్వడం లేదని గాడ్గిల్‌ ఆరోపిస్తున్నారు. తప్పుడు నివేదికలతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రతి రాష్ట్రం కేరళగా మారడం ఖాయమని హెచ్చరించారు.
 

Similar News