ముందస్తు సంకేతాలతో వేడెక్కుతోన్న తెలంగాణ....మంత్రులతో సీఎం అత్యవసర భేటీ

Update: 2018-08-22 04:54 GMT

ముందస్తు సంకేతాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయాలను సిద్ధమవుతున్నారు. కేవలం రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా ఈరోజు కీలక సమావేశం జరగబోతోంది. మంత్రులతో అత్యవసరంగా సమావేశం కాబోతున్న కేసీఆర్‌‌ ముందస్తు వ్యూహాన్ని ఖరారుచేసే అవకాశం కనిపిస్తోంది. 

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో ముందస్తుపై సంకేతాలిచ్చి తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మంత్రులతో అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు మంత్రులంతా తప్పనిసరిగా హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాంతో జిల్లా పర్యటనల్లో ఉన్న మంత్రులంతా హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. సాయంత్రం 4గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశంకానున్న కేసీఆర్‌ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కీలక మంతనాలు జరపనున్నారు. అలాగే జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఒకవేళ డిసెంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగేటట్టయితే సెప్టెంబర్‌ నెలాఖర్లోగా శాసనసభను రద్దుచేసే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో వీటన్నింటిపైనా మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రగతి నివేదన సభ, అభ్యర్ధుల ఎంపిక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం, విపక్షాలను ఎదుర్కోవడంపై మంత్రులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

మొత్తానికి ముందస్తు ఎన్నికలే లక్ష్యంగా ఇవాళ కీలక నిర్ణయాలు జరగనున్నాయి. పూర్తిగా రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా జరిగే ఈ మీటింగ్‌ తర్వాత ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Similar News