కేసీఆర్ కోర్టులో డీఎస్ కేస్...కేసీఆర్‌ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Update: 2018-06-28 05:09 GMT

టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ వ్యవహారం సీఎం కేసీఆర్ కోర్టుకి చేరింది. డీఎస్‌ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, నిజామాబాద్ జిల్లా నేతలు చేసిన విమర్శలకు వివరణ ఇస్తారు. డీఎస్‌ వివరణ తర్వాత కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం  తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌పై నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారనీ ఆయనపై చర్యలు తీసుకోవాలనీ కోరడంతో ఇప్పుడు అందరి దృష్టీ కేసీఆర్ వైపు మళ్ళింది. దీంతో డీఎస్ హడావిడిగా హైదరాబాద్‌ చేరుకున్నారు.

వాస్తవానికి నిన్నటి వరకు ఢిల్లీలో మకాం వేసిన డీఎస్ నాలుగు రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు ఆయన కేసీఆర్‌తో భేటీ అవ్వాల్సి ఉంది. కానీ అంతలోనే అపాయింట్‌మెంట్‌ రద్దయ్యింది. ఇవాళ సీఎంను కలవాల్సిందిగా డీఎస్‌కు వర్తమానం అందింది. అయితే డీఎస్ మాత్రం నిజామాబాద్ నేతల ఫిర్యాదును లైట్ గా తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగానే నడుచుకుంటున్నానంటున్న డీఎస్.. క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.  అసలు తన వల్ల ఇతరులెవరికీ సమస్యే లేదంటున్నారు డీఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఓకే అని అంటున్నారు.  

Similar News