అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్న కేసీఆర్

Update: 2018-09-06 03:43 GMT

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఈ మధ్యాహ్నం మంత్రివర్గం సమావేశమై ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేయబోతోందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశ అజెండాలో శాసనసభ రద్దుకు సంబంధించిన అంశం మాత్రమే ఉందని సమాచారం. అయితే మంత్రివర్గం ఎన్ని గంటలకు సమావేశమవుతుందన్న దానిపై స్పష్టత రాలేదు. ఉదయం, మధ్యాహ్నం ఇలా పలు సమయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవాళ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం కార్యాలయం చెప్పినట్లు స్పష్టమవుతోంది. దీంతో జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు హూటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

అయితే కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన ఎజెండాను సాధారణ పరిపాలన శాఖ ఇప్పటివరకూ మంత్రులకు పంపలేదు. ప్రగతి భవన్‌లో సమావేశానికి రాగానే జీఏడీ అధికారులు ఎజెండా కాపీలను మంత్రులకు అందజేస్తారు. ఆ వెంటనే శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకుంటారు. ఈ కసరత్తు పూర్తయ్యేలోపు ముఖ్యమంత్రి కేసీఆర్ ..శాసనసభ రద్దు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నదానిపై అమాత్యులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన వరుస పరిణామాలతో ఇవాళ మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ జరగడంతో పాటు  అసెంబ్లీ రద్దు నిర్ణయం ఖాయమని అర్థమవుతోంది. 

శాసనసభ రద్దు తర్వాత గవర్నర్‌ నరసింహన్‌ ఈ సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్‌ తన నోటిఫికేషన్‌లో పేర్కొంటారని అంటున్నాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే గవర్నర్ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినపక్షంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. 

అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం తన ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్‌‌కు చేరుకొని అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సలహాదారు రాజీవ్‌శర్మ, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, జీఏడీ రాజకీయ కార్యదర్శి అధర్‌ సిన్హా, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంతనాలు జరిపారు. అసెంబ్లీ రద్దు, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు ఉద్యోగుల మధ్యంతర భృతి, వివిధ శాఖలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా కలవలేదు. ఇవాళ అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసిన తర్వాతనే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 

ముందస్తుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఆఖరి క్షణం వరకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసింది. వివిధ వర్గాలకు వరాలు ఇప్పటికే ఇచ్చిన వరాలకు సంబంధించిన ఉత్తర్వులు చివరి నిమిషం బదిలీలు - పోస్టింగులు..పెండింగులో ఉన్న నిధుల విడుదల.. ఫైళ్ల క్లియరెన్సు. ఇలా అన్నీ కలిపి తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రభుత్వం రద్దు ఖాయమనే ప్రచారం జరగడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని సచివాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సచివాలయంలో గత రెండ్రోజులుగా నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా సందర్శకుల తాకిడి కనిపించింది. కొందరు ఎమ్మెల్యేలైతే సెక్షన్‌లన్నీ తిరుగుతూ తమ ఫైలు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కూడా తమ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టిపెట్టారు. 

Similar News