ఏపీ కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్...రేసులో ఆ ముగ్గురు...

Update: 2018-08-23 03:34 GMT

ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగంసిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం కేబినెట్‌ విస్తరణ దాదాపు ఖాయమైనట్లు టాక్‌ వినిపిస్తోంది. విజయవాడలో గవర్నర్‌తో సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతోపాటు ప్రస్తుత మంత్రుల శాఖలను మార్చే అవకాశముందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ముస్లింలకు కచ్చితంగా కేబినెట్‌లో చోటు ఇవ్వాల్సి ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ప్రకటనలు చేయడంతో వచ్చే సోమవారం అంటే ఈనెల 27న మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే మాట వినిపిస్తోంది. బీజేపీ నిష్క్రమణతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి ముస్లింలకు కేటాయిస్తే మరొకటి భర్తీ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. అయితే ఈనెల 28న గుంటూరులో జరిగే ముస్లిం మైనారిటీ సదస్సుకు ముందు రోజే కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. రేసులో షరీఫ్‌, చాంద్‌ పాషా, ఫరూక్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా చాంద్‌పాషా వైసీపీ నుంచి రావడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

కేబినెట్‌ విస్తరణతోపాటు పలువురి శాఖల్లో మార్పులుచేర్పులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వచ్చిన గవర్నర్‌తో సుమారు రెండున్నర గంటలపాటు సమావేశమైన చంద్రబాబు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపైనే మాట్లాడినట్లు అధికారిక వర్గాలు అంటున్నాయి. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గం మద్దతు కూడగట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే రెండు మూడ్రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.

Similar News