shooting-colorado

Update: 2017-12-12 11:06 GMT

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్‌టన్‌ నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ఓ దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. 
 
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మాల్‌ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలియటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
న్యూయార్క్‌ నగరంలో ఓ దుండగుడు నిన్న ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన మరుసటి రోజే మరో ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
 

Similar News