తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు

Update: 2018-06-30 06:11 GMT

తండ్రి బాటలో తనయుడు పయనిస్తున్నాడా..? ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన తీరు చూస్తుంటే. ఎన్నికలు దగ్గరపడిన సమయంలో తన నియోజకవర్గంలోని మూరుమూల గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎప్పుడూ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపవాదును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు బాలకృష్ణ. 

గతం కంటే భిన్నంగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఈసారి కొనసాగింది. మూడురోజులపాటు నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ చిలమత్తూరు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇకనుంచి అందరికీ అందుబాటులో ఉంటానని, ఏవైనా సమస్యలుంటే తనకే నేరుగా చెప్పాలని ప్రజలకు సూచించారు బాలకృష్ణ. 

తొలిరోజు సోమగట్టు గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి భూమి పూజ చేసి, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఆ తర్వాత చాగలేరు, కొడికొండ పంచాయతీల్లో పర్యటించి కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఆయన కొడికొండ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం దిగువపల్లి తండాకు వెళ్లి  అక్కడే ఓ ఇంట్లో బస చేశారు బాలయ్య. 

రెండో రోజు మొరంపల్లి, కోడూరు, శెట్టిపల్లి ఎస్సీ కాలనీ, మరువకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన వీరాపురంలో రాత్రికి బస చేశారు. తన పర్యటనలో భాగంగా చివరి రోజున చిలమత్తూరు మండలంలోనే గడిపారు. పాత చామలపల్లి, కొత్త చామలపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బాలయ్య ఆదేపల్లి తండాలో మహిళలతో కలిసి చిందేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ గతం కంటే భిన్నంగా వ్యవహరించి నియోజకవర్గంలో పర్యటించడంతో ప్రజలు, పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Similar News