శశికళను వెంటాడుతున్న జయ మృతికేసు

Update: 2018-06-29 10:36 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందు జయలలిత ఇంట్లో ఏం జరిగింది? జయ ఆరోగ్యం విషమించినా...వెంటనే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదు? జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్ విచారణలో ఏం తేలింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయ్. జయలలితను ఆసుపత్రికి తరలించడానికి ముందు ఏం జరిగిందన్న దానిపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు డ్రైవర్‌ కన్నన్‌ కీలక విషయాలను వెల్లడించారు. 22 సెప్టెంబర్ 2016న తాను అమ్మ గదిలోకి వెళ్లేసరికి ఆమె కుర్చీలో అచేతన స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆ పక్కనే కొన్ని ఫైళ్లు, మూత లేని పెన్ను పడి ఉన్నాయని కన్నన్ కమిషన్‌ ముందు చెప్పారు. 

తనను చూసిన వెంటనే శశికళ ఓ కుర్చీ తీసుకురమ్మన్నారని తర్వాత జయలలితను ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పినట్లు వివరించారు. వ్యక్తిగత భద్రతాధికారిని వీరపెరుమాళ్‌ను పిలిపించి వీల్‌ఛైర్‌ను మార్చడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. వీరుపెరుమాళ్, తాను కలిసి జయలలితను మరో కుర్చీలోకి మార్చామని కన్నన్ కమిషన్ ముందు వెల్లడించారు. రాత్రి ఎనిమిదిన్నర దాకా జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు డాక్టర్ శివకుమార్‌ పోయెస్‌ గార్డెన్‌లోనే ఉన్నారని చెప్పారు. తర్వాత గంట పాటు ఎక్కడికి వెళ్లారో తెలియదని తొమ్మిదిన్నర తర్వాత కనిపించాడని కన్నన్ ఆర్ముగస్వామి కమిషన్‌కు వివరించారు.

గతంలో శశికళ, డాక్టర్ శివకుమార్ సమర్పించిన అఫిడవిట్‌లో వివరాలు, కన్నన్ సమర్పించిన అఫిడవిట్‌లో వివరాలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. జయలలిత మంచంపై కూర్చొని ఉండగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారని, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని శశికళ, శివకుమార్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎనిమిదిన్నర తర్వాత శివకుమార్‌ ఎక్కడికి వెళ్లారో రెండు అఫిడవిట్లలో చెప్పలేదు. డ్రైవర్‌ చెబుతున్న అంశాలకు, శశికళ, శివకుమార్‌ చెబుతున్న వాటికి పొంతన కుదరకపోవడంతో జయలలిత మరణంపై అనుమానాలు బలపడుతున్నాయి.

Similar News