రైలు కిందపడి చావనైనా ఛస్తా కానీ మళ్లీ నీ గడపతొక్కనని సవాల్ చేశా: ఖుష్బూ

Update: 2018-01-20 10:11 GMT

ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించిన సీనియర్‌ నటి ఖుష్బూ. ఆమె తన ఏడేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి ఎనలేని అభిమానుల్ని సంపాదించుకున్నారు. తమిళనాడులో ఆమె కోసం గుడి కూడా కట్టారు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 16 ఏళ్ల ప్రాయంలో ఖుష్బూ తన తండ్రి ఇంటి నుంచి తల్లిని, సోదరుడ్ని తీసుకుని బయటకి వచ్చేశారు.

ఈ విషయాన్ని ఆమె ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో గుర్తు చేసుకున్నారు. చిన్నవయసులోనే తాను రెబల్ గా మారిన విషయాన్ని ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తండ్రి విచక్షణ లేని వ్యక్తని అన్నారు. ఆయన అసభ్యంగా దూషించే భర్త అని, మహిళల్ని ఆయన కించపరిచే తీరు నచ్చక, ఆయనకు ఎదురు తిరిగి, కుటుంబం నుంచి అమ్మ, సోదరుడ్ని తీసుకుని బయటకు వచ్చేశానని వెల్లడించారు. ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ‘నాకు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది, 1986 సెప్టెంబరు 12వ తేదీన ఇంట్లో వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మను అనరాని మాటలంటుంటే ఎదురుతిరిగి బయటకు వచ్చేశాను. ఆప్పుడు నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకొచ్చి పోషిస్తావా? అని ఆయన నాపై అంతెత్తున లేచారు. దీంతో నా సోదరుడ్ని, అమ్మను చంపేసి.. నేనూ రైలు కిందపడిపోతానే కానీ మళ్లీ నీ దగ్గరికి తిరిగి రాను అని ఆయనతో సవాల్ చేసి, బయటకు వచ్చేశాను. నాటి నుంచి నేటి వరకు మా నాన్నను చూడాలని ఏ రోజూ అనుకోలేదు, చూడను కూడా’ అని ఆమె తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనను వెల్లడించారు. 

Similar News