రాయచోటికి ఇప్పటి వరకూ దక్కని మంత్రి పదవి

Update: 2019-06-16 08:36 GMT

అందరి పొలాల్లోనూ మొలకలొచ్చాయి. నా పొలంలో మాత్రం రాలేదంటూ ఒక సినిమాలో హీరో తెగ ఫీలయిపోతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గం కూడా అలాగే ఫీలవుతోంది. ఏదో ఒకసారి, ప్రతి నియోజకవర్గానికి యోగం తలుపుతడుతోంది, తన వాకిట మాత్రం రావడం లేదని కుమిలిపోతోంది. ఇంతకీ ఏదా సెగ్మెంట్ ఎందుకు కోసం అంత బాధ? కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఏర్పడిన్పటి నుంచీ, ఉత్కంఠ పోరే. ప్రతి ఎన్నిక ఇక్కడ టెన్షన్‌ టెన్షన్‌గా సాగుతుంది. ఎవరు గెలిచినా ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ తప్పదు. పూర్తి ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన దాఖలాల్లేవు. ఏ ఎన్నికలు చూసినా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కేవారు. ఇరు పార్టీల తరుపున బలమైన అభ్యర్ధులే పొటీచెయ్యడంతో ప్రతి ఎన్నిక హోరాహోరీగానే సాగేది. టిడిపి గాలి వీచినిప్పుడు కాంగ్రెస్ గెలవడం, కాంగ్రెస్ గాలి వీచినప్పుడు టిడిపి గెలవడం కూడా ఇక్కడి రాజకీయాల్లో ప్రత్యేకత. అయితే 2012 ఉప ఎన్నికలు, 2014, 2019 ఎన్నికలు మాత్రమే ఒకే పార్టీకి పూర్తి స్థాయి అనుకూల వాతారణంలో జరిగాయని అనుకోవాలి. ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన శ్రీకాంత్ రెడ్డి మాత్రమే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇంత ప్రతిష్టాత్మకమైన రాయచోటికి, కలిసిరాని అదృష్టం కూడా ఒకటుంది. అదే మంత్రి పదవి దక్కకపోవడం.

1952 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరగ్గా వివిధ పార్టీల తరపున మహామహులు రాయచోటి నుంచి గెలుపొందారు. రాయచోటి తొలి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు నేతృత్వంలోని కె.ఎం.పి.పి పార్టీ తరపున పోటీ చేసి, శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఇక 2009, 2014, 2019 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గానికి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిలు పోటీ చేస్తూ వచ్చారు. ఇలా ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రతి ఒక్కరూ హోరాహోరి పోరులో గెలుస్తూ వచ్చారు. అయితే 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ, రాయచోటికి మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అదే పెద్దలోటు.

గతమెలా ఉన్నా, ప్రస్తుత వైఎస్ జగన్‌ ప్రభుత్వంలో మాత్రం మంత్రి దక్కే వారిలో వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు. మొదటి నుంచీ జగన్‌ వెన్నంటే నడిచిన శ్రీకాంత్‌ రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ చివరకు ఆయనను ఊరించి ఉసురుమనిపించింది కేబినెట్‌ మినిస్ట్రీ. కానీ గతంలో ఎప్పుడూ దక్కని పదవి మాత్రం దక్కింది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డిని నియమించడం ద్వారా నియోజకవర్గానికి తొలిసారి క్యాబినెట్ హోదా దక్కినట్లయ్యింది. ఇది ఆయన వర్గీయులను కొంత నిరాశ పరచినా, దక్కిన పదవి కూడా క్యాబినెట్ స్థాయి పదవి కావడం కొంత ఊరట కలిగించే అంశం. అయితే ఏదిఎమైనా నియోజకవర్గానికి మాత్రం మంత్రి పదవి అన్నది అందని ద్రాక్షేనన్న అభిప్రాయం, మరోమారు రుజువైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగే కేబినెట్‌ విస్తరణలోనైనా చోటు దక్కుతుందేమోనని జనం ఆశిస్తున్నారు.

Full View

Tags:    

Similar News