స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుకు స్పందించని అధికారిపై వేటు

Update: 2019-07-11 03:11 GMT

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట్నుంచీ స్పందన కార్యక్రమం నిర్వహణ విషయం లో పట్టుదలతో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనీ, ఫిర్యాదులపై ఉదాసీనత కూడదనీ అయన చెబుతూ వచ్చారు. అయినా, ఆయన మాటల్ని పెడచెవిన పెట్టిన ఒక అధికారిపై ప్రభుత్వం వేటు వేసింది. వివరాలిలా ఉన్నాయి.

గత నెలలో విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి రేషన్ షాప్ ను డీలర్ కాకుండా బినామీ నిర్వహిస్తున్నాడని దానిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయ భాస్కర్‌ కు ఫిర్యాదు చేశారు.

అయితే ఆ ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయ భాస్కర్ ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ విషయం కాస్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. బుధవారం ఉదయం స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చిన పిటీషన్ పై అధికారి పట్టించుకోని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైయస్ జగన్ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో ఎవరు అలసత్వం వహించిన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చిరించారు.

పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయభాస్కర్ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టి వరకు వెళ్లడంతో ఆయనపై వేటు వేశారు. ఉదయభాస్కర్ ను సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags:    

Similar News