ఈ తరహా చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏపీనే..బెల్ట్ షాపుల శాశ్వత మూసివేతకు..

Update: 2019-08-15 08:25 GMT

బడుగులు, మహిళలకు పెద్దపీట వేస్తూ చరిత్రగతిని మార్చే చట్టాలను తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత ఏపీదే అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్ ఆవిష్కరించారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని జగన్ చెప్పారు.

పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలంటూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ చెప్పారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ముందుగానే తెలుసుకొని స్థానిక యువతకు అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అటు పరిశ్రమలకు, ఇటు స్థానికులకు వెన్నుదన్నుగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది అని జగన్ వెల్లడించారు.

రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను శాశ్వతంగా మూయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా లాభాపేక్ష లేకుండా అక్టోబర్‌ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయించనున్నట్లు తెలిపారు. మధ్య నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేశారు.  

Tags:    

Similar News