ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన జగన్‌

మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

Update: 2020-02-08 10:32 GMT

మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు ఏపీ రాష్ట్ర సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ సీఎం జగన్ రిమోట్ ద్వారా ప్రారంభించారు. అంతేకాకుండా మహిళల కోసం దిశ యాప్‌ను సిద్ధం చేశారు.. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడిన జగన్ పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని కొనియాడారు. అందుకోసం మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మహిళలకి ఓ శుభవార్తను కూడా అందజేశారు జగన్ .. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని, త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చేపడతామని జగన్ తెలిపారు. నిజానికి ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలు చేశారని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రుణాలు నిలిపివేసిందని జగన్ వెల్లడించారు. ఇక ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు

Tags:    

Similar News