టీడీపీ నియోజకవర్గ బాధ్యుల మార్పులు.. ఆక్కడి వారు ఇక్కడికి..ఇక్కడి వారు అక్కడికి

Update: 2020-03-06 04:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం పార్టీ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీల మార్పులు చేర్పులను చేబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

గత ఎన్నికల్లో చాలామంది నేతల సీట్లు అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు మార్చారు. అలా మార్చిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో చాలా మంది ఎన్నికల తరువాత పార్టీకి గుడ్ బై చెప్పడమో.. అంటీ ముట్టనట్టు మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కేడర్ ను తిరిగి ఉత్సాహపరిచేందుకు గత ఎన్నికల ముందు ఉన్న పరిస్థితిని తీసుకువచ్చెనందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటించారు.

పాయకరావుపేట మళ్ళీ అనితకు..

గత ఎన్నికల సమయంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్న వంగలపూడి అనిత ను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. పాయకరావుపేట లో బంగారయ్యకు సీటిచ్చారు. రెండుచోట్లా టీడీపీ ఓటమి పాలైంది. దీంతో స్థానిక సమరానికి అనిత ను తిరిగి పార్యకరావుపేట ఇన్ ఛార్జ్ గా నియమించారు.

ఏలూరు, మాచెర్ల లకూ ఇంచార్జిల మార్పు..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామయ్య (బుజ్జి) మరణించారు. దీంతో అక్కడ అయన సోదరుడు బడేటి రాధాకృష్ణకు స్థానిక ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పారు. ఇక గుంటూరు జిల్లా మాచర్ల లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న చలమారెడ్డికి కాకుండా అంజిరెడ్డికి టికెట్ కేటాయించారు. అయితే ఆయన ప్రభుత్వ విప్ పిన్నెల్లి చేతిలో ఓడిపోయారు. దీంతో స్థానిక సమరానికి తిరిగి కొమ్మారెడ్డి చలమారెడ్డి కె బాధ్యతలు అప్పచెపుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

గుడివాడ లో రావి కే తిరిగి బాధ్యతలు!

గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన రావి వెంకటేశ్వర రావుకు అధిష్టానం నో చెప్పింది. విజయవాడ నుంచి టీడీపీ లో చేరిన దేవినేని అవినాష్ కు గుడివాడ సీటు కేటాయించింది టీడీపీ. అయితే, అయన మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. తదనంతర పరిణామాల్లో దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడి కేడర్ ను కాపాడుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధం చేసే పనిని తిరిగి రావి వెంకటేశ్వర రావుకు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదేవిధంగా పలు నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్ చార్జీల విషయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేశారు. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.   

Tags:    

Similar News