జగన్‌ పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Update: 2019-08-13 15:59 GMT

ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితిని తెచ్చుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు గోదావరి జలాల తరలింపు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీకి ద్రోహం చేసేలా ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు జరిగేలా పాలన జరిగితేనే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వ పాలన విధ్వంసకరంగా ఉండటంతో ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సి ఉన్నా పోరుబాట పట్టక తప్పని పరిస్థితి నెలకొందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు జగన్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. 73 రోజుల వైసీపీ పాలనలో 469 దాడులు జరిగాయని ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న చంద్రబాబు ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రంలో చేయాలని చూస్తే సాగనిచ్చేది లేదన్నారు.

టీడీపీపై అక్కసుతోనే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిలిపేశారని ఆరోపించారు చంద్రబాబు. గోదావరి జలాల తరలింపులో జగన్‌, కేసీఆర్‌లు రాష్ట్రానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగితేనే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. టీడీపీకి సంక్షోభాలు, సవాళ్ళు కొత్తకాదని ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి కేడర్ కుంగిపోవద్దని చంద్రబాబు ధైర్యాన్నిచ్చారు. 60 లక్షలకు పైగా కార్యకర్తలున్న టీడీపీని ఎవ్వరు ఏమి చేయలేరని భరోసా ఇచ్చారు.  




 


Tags:    

Similar News