గెలుపోటములు వర్షపు జల్లుల్లో!

Update: 2019-07-10 00:48 GMT

అనుకున్నంతా అయింది. వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్ కు వాన విలన్ గా మారింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ అనగానే వర్షం సిద్ధం అయిపోయింది. లీగ్ దశలో అసలు గ్రౌండ్ లోకే ఆటగాళ్లను రానీయని వాన.. సెమీస్ పోటీలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చివరి దశలో వచ్చి ఆట జరగకుండా ఆపేసింది. పూర్తిగా మ్యాచ్ మీద పట్టు సాధించిన భారత్ కివీస్ ను కట్టడి చేసింది. వీడని వర్షం కారణంగా మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆట ఆగే సమయానికి న్యూజిలాండ్‌ స్కోరు 46.1 ఓవర్లలో 211/5. బుధవారం ఇక్కడి నుంచి మ్యాచ్‌ కొనసాగనుంది.

కొద్ది గంటలు ఆట కొనసాగివుంటే ఈ పాటికి టీమిండియా ఫైనల్స్ లో ఎవరితో ఆడుతుందో అనే అంచనాలలో మునిగిపోయేవారు అభిమానులు. కనీ, ఇపుడు పరిస్థితి ఈరోజైనా వాన వదులుతుందో లేదో అనే అనుమానం ఒకవైపు.. ఒకవేళ మ్యాచ్ జరిగితే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందా.. బంతి గిర్రున తిరిగితే భారత్ పరిస్థితి ఏమిటి అనే ఆందోళనలో అందరూ పడిపోయారు.

భారత్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ వర్షం వల్ల అర్ధంతరంగా ఆగింది. మంగళవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులతో ఉన్న దశలో వర్షం మొదలై ఆట ఆగింది. మూడు గంటలకు పైగా వర్షం విడిచిపెట్టలేదు. సెమీస్‌తో పాటు ఫైనల్‌కూ రిజర్వ్‌డే ఉండటంతో మ్యాచ్‌ను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు భారత్‌కు టాస్‌ కలిసి రాకపోయినా.. బౌలర్లు చక్కటి ప్రదర్శనతో కివీస్‌కు కళ్లెం వేశారు. బుమ్రా (8-1-25-1), భువనేశ్వర్‌ (8.1-1-30-1) ఆరంభంలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టారు. జడేజా (1/34) కూడా రాణించాడు. న్యూజిలాండ్‌ జట్టులో విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో), టేలర్‌ (67 బ్యాటింగ్‌; 85 బంతుల్లో) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడారు. టేలర్‌కు తోడుగా లేథమ్‌ (3) క్రీజులో ఉన్నాడు.

అప్పుడూ ఇలాగే..

ప్రపంచకప్ లో వర్షం రావడం, వాయిదా పడటం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ జరిగింది. అప్పుడు కూడా టీమిండియా మ్యాచే కావడం గమనార్హం. ఇంకో విషయం ఏమిటంటే అది కూడా ఇంగ్లాండ్ లోనే జరిగిన ప్రపంచ కప్ సమరం కావడం. 1999 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, ఇండియా మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగిలాడు. మొదట భారత్‌ 8 వికెట్లకు 232 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 20.3 ఓవర్లలో 73/3తో ఉండగా వర్షంతో మ్యాచ్‌ ఆగింది. మరుసటి రోజు అక్కడి నుంచే ఆట కొనసాగించారు. టపాటపా వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్‌ 169 పరుగులుకే కుప్పకూలింది.  

Tags:    

Similar News