కష్టపడి పైకొచ్చాడు.. డబ్బు పిచ్చితో పతనమైపోయాడు..

Update: 2019-07-18 12:01 GMT

అతడు చదువుకోలేదు అయితేనేమి అనితర సాధ్యమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. పేదరికం నుంచి వచ్చాడు పరవాలేదు అందరికీ అన్నం పెట్టి పేద్ద పేరు సంపాదించాడు. ఓ చిన్న నమ్మకం, అత్యాశ, తెగబడిన తెలివి తక్కువ పనితో జైలు ఊచలు లెక్కపెట్టాడు. చివరకు మనుగడ కోసం పోరాడుతూ తనువు చాలించాడు.

అతిగా ఆవేశపడే ఆడది... అతిగా ఆశ పడే మగాడు ఈ చరిత్రలో బాగుపడినట్లు లేదు. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ సీనిమాలో వచ్చే డైలాగ్. ఈ డైలాగ్ దోశా రాజు అలియాస్ దోశల రాజగోపాల్ అలియాస్ గొలుసుకట్టు శరవణ భవనాల రారాజు శరవణ రాజగోపాల్ కి అతికినట్టు సరిపోలుతుంది. గుడ్డి నమ్మకంతో, అతిగా ఆశపడి, లాజిక్ కోల్పోయి, కటకటాల పాలై, చివరకు కాటికి వెళ్ళాడు.

రాజగోపాల్ 1947లో తమిళనాడులోని టూటీకోరిన్ జిల్లా పున్నయి యాడీ అనే ఊళ్ళో ఓ రైతు, ఉల్లిగడ్డల వ్యాపారి ఇంట పుట్టాడు. పెద్దగా చదువు అబ్బలేదు. దీంతో 1973లో చెన్నైలోని కెకె నగర్ లో జనరల్ స్టోర్ పెట్టాడు. 1981లో అదే కాలనీలో ఓ చిన్న హోటల్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత శరవణ పేరుతో గొలుసు కట్టు హోటళ్ళు విస్తరించి హోటల్ రంగంలో రారాజుగా, దోశ రాజుగా పేరుగాంచి, కోట్లకు పడగలెత్తాడు.

అయితే, పిచ్చి ముదిరితే ఎంతకైనా తెగిస్తారు. అలా రాజగోపాల్ కి డబ్బు పిచ్చి పట్టింది. దాంతో పాటు కొన్ని నమ్మకాలూ ఏర్పడ్డాయి. ఓ జ్యోతిష్యుడి సూచనతో అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసికుని, మనవళ్ళు, మనవరాళ్ళున్న 70 ఏళ్ళ రాజగోపాల్ మూడో పెళ్ళికి సిద్ధమయ్యాడు. తన వద్దే పని చేసే ఓ వర్కర్ కూతురి మీద కన్నేశాడు. ఆమెను పెళ్ళి చేసుకుందామనుకున్నాడు కానీ అప్పటికే పెళ్ళైన ఆమె ఒప్పుకోలేదు. ఇక్కడే రాజగోపాల్ లోని మృగాడు లేచాడు. అనేక రకాల హింసల తర్వాత ఆమె భర్తని చంపించాడు. భర్త లేకపోతే ఆమె తనను పెళ్ళి చేసుకుంటుందనుకున్న రాజగోపాల్, ఆ భర్తని తానే లేపేస్తే జైలుకు పోతానన్న లాజిక్ మిస్సయ్యాడు.

ఈ కేసులో విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు తొలుత అతడికి 10ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మారుస్తూ 2009లో తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో జైలులో మగ్గుతున్న రాజగోపాల్ గుండెపోటుకు గురై, జులై 18న కన్ను మూశాడు. అతిగా ఆశ పడి అసలుకే ఎసరు తెచ్చుకున్నాడు. పాపం దోశ రాజు అలియాస్ శరవణ రాజగోపాల్.

Tags:    

Similar News