మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్' సినిమా చేస్తుండగానే .. ప్రియా ప్రకాష్ వారియర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో మలయాళంతోపాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఓవర్ నైట్లో కోటి రూపాయల పారితోషికం అందుకొనే స్థాయికి ఎదిగిపోయింది. ఈ నేపథ్యంలో 'ఒరు ఆదార్ లవ్' సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవర్స్ డే' పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ ఫిబ్రవరి 14వ విడుదల చేస్తోంది. ఈ సినిమా తెలుగు ఆడియో వేడుక హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం జరగనుంది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య సుఖీభవ సినిమాస్ సంస్థ హక్కులను దక్కించుకుంది. కాగా రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి ఈ భారీ హైప్ క్రియేట్ అయింది. కేవలం 27 సెకన్ల పాటు ప్రియా ప్రకాష్ చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు.