దాసరి నారాయణరావు : లవ్ నుంచి రివెంజ్ వరకూ ఆయన రూటే సపరేటు!

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు (మే 4). ఈ సందర్భంగా ఆయన వైవిధ్య భరితమైన సినిమాల పరిచయం

Update: 2020-05-04 01:10 GMT

ఒక హీరో.. ఒక హీరోయిన్.. భగ్న ప్రేమ.. ప్రేమాభిషేకంగా ప్రేక్షకులను ప్రేమానుభూతిలో ముంచేస్తే..

ఒక మిలటరీ ఆఫీసర్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాల పై బొబ్బిలి పులిలా పంజా విప్పి విరుచుకుపడితే..

ఒక అబల.. దొరల పెత్తనంపై రాములమ్మలా కదం తొక్కితే..

రాజకీయం అంటేనే లంచాల అరాచకీయం అంటూ ఎమ్మెల్యే ఏడుకొండలు రచ్చకెక్కితే..

ఆమెకూ రిటైర్మెంట్ కావాలి అంటూ అమ్మతో రాజీనామా చేయిస్తే..

స్త్రీ పురుష సంబంధాల బాంధవ్యాలకూ సమాజ పోకడలకూ మధ్య సున్నితత్వాన్ని మేఘసందేశం గా పంపిస్తే..

ప్రేమ..పెళ్లి..సమాజం..రాజకీయం..విప్లవం..ప్రశ్న..జవాబు ఇలా అన్ని అంశాల్ని ప్రేక్షకుల గుండెలోతుల్లోకి తీసుకువెళ్ళే సత్తా ఉన్న ఏకైక దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు. కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. పాటలు.. దర్శకత్వం.. నటన.. ఇలా అన్ని శాఖల్లోనూ చెరగని ముద్ర దాసరి. వైవిధ్యం అయన నడక.

ఎన్టీఅర్.. ఏఎన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు.. కృష్ణంరాజు.. ఇలా హీరో ఎవరైనా సరే వారి ఇమేజి చట్రానికి మరింత బలమైన ఇరుసును ఆవిష్కరించి వారిని మరో మెట్టుమీద నిలబెట్టిన దర్శక ధీరుడు. పెద్ద సినిమాలు తీసి ఎంతలా దూసుకు పోతారో.. చిన్న సినిమాలు తీసి అంతకంటే ఎక్కువగా నిర్మాతలకు అండగా నిలబడ్డ దర్శకరత్న దాసరి నారాయణరావు.

ఇండస్ట్రీలో అందరికీ పెద్దన్నగా మన్ననలు పొంది.. సినిమాలు తీయడంలో సాటిలేని గిన్నిస్ రికార్డు సాధించి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించిన దాసరి నారాయణరావు జయంతి ఈరోజు (మే 4)

లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న అందరికీ ఏకైక వినోదం టీవీ. ఇప్పుడు అవకాశం ఉంది కదా ఒక్కసారి దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మేలి ముత్యాల్లాంటి ఈ సినిమాల్ని వెతికి పుచ్చుకుని చూడండి. ఆ సినిమాలు మిమ్మల్ని వెంటాడటం కాదు.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు వాటిలోని వైవిధ్యానికి. ఎందుకంటే.. ప్రేమ కథల్ని ఎంత బాగా తీసి మెప్పించారో అంతకంటే బాగా విప్లవ కథల్ని జనంలో కదం తొక్కించారు. అల్లరి కథలతో కుర్రకారును ఎంతలా గిచ్చారో.. సున్నితమైన భావోద్వేగాలున్న కథలతో అందరి గుండెల్నీ అంతలా గుచ్చారు. ఇది దర్శకరత్న దాసరికి మాత్రమె సాధ్యమైన ఫీట్.

దాసరి సినిమాల్లో ఇవి చూడండి అని చెప్పడం పెద్ద సాహసం. కానీ, ఆయన దర్శకత్వంలోని వైవిధ్యాన్ని.. నటనలోని మెరుపుల్ని చూపించిన కొన్ని సినిమాలు మచ్చుకి మీకోసం ఇక్కడ లిస్టు ఇస్తున్నాం. సరదాగా ఈ సినిమాల్ని చూసేయండి. ఆపాత మధురంలో మీరూ ఊగిపోతారు. దాసరి దర్శకత్వ మాయకు మీరు ఫిదా అయిపోతారు.

*మేఘ సందేశం *బొబ్బిలిపులి *సర్దార్ పాపారాయుడు *స్వయంవరం *సూరిగాడు *ప్రేమాభిషేకం *మజ్ను *బలిపీఠం *ఒసేయ్ రాములమ్మ *ఒరే రిక్షా *ఎమ్మెల్యే ఏడుకొండలు *లంచావతారం *కృష్ణార్జునులు *తతా మనవడు *మనుషులంతా ఒక్కటే *తూర్పూ పడమర *ఇదెక్కడి న్యాయం *కటకటాల రుద్రయ్య *సీతారాములు *శ్రీవారి ముచ్చట్లు *బహుదూరపు బాటసారి *మామగారు 

Tags:    

Similar News