ఒక్క మాటే ఓడించిందా..?

Update: 2019-05-24 10:24 GMT

ఒకే ఒక్క మాట రాజకీయాలపై ప్రభావం ఉంటుందని చూపించారు ఓటర్లు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు జీవం పోసిన కరీంనగర్ ప్రజలపై కేసీఆర్ తూలిన ఒక్క మాటే ఎన్నికల్లో ఓడించిందా..? తాజా ఫలితాలు చూస్తుంటే ఇదే నిజమని భావిస్తున్నారు విశ్లేషకులు.

నేతలు తూలిన మాటలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి అనడనికి కరీంనగర్ లోక్ సభ ఓటర్లే తీర్పే మరో సారి నిరూపించింది. 2006లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ రావు దమ్ముంటే రాజీనామా చేసి గెలువ్ అంటూ కేసీఆర్ కు విసిరిన సవాల్ ను అప్పట్లో కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ స్వీకరించి తక్షం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల్లో గులాబీ బాస్ కు భారీ మెజార్టీ కట్టబెట్టారు.

ఎమ్మెస్సార్ తూలిన ఒక్క మాటతో కరీంనగర్ ప్రజలు పట్టుదలతో కేసీఆర్ ను గెలిపించుకోవడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఊపు తీసుకువచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంలో అదే కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీని విమర్శిస్తూ మాట్లాడిన తీరే ఓ వర్గం ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.

కరీంనగర్ నుంచి వరుసగా రెండో సారి కచ్చితంగా గెలుస్తారని గులాబీ పార్టీ అంచనాలు వేసుకున్నది. అయినా కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో వినోద్ కుమార్ దాదాపు 90వేల ఓట్ల తేడాతో పరాజయానికి దారి తీశాయనుకుంటున్నారు. ఎమ్మెస్సార్ ను దూరం చేసిన కరీంనగర్ ఓటర్లు గులాబీ పార్టీని తిరస్కరించారు. 

Similar News