ప్రధాని మోడీకి తెలంగాణ రైతుల షాక్..

Update: 2019-04-23 10:45 GMT

తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చేందుకు తెలంగాణ పసుపు రైతులు సిద్ధమయ్యారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణం ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు వారణాసికి వెళ్లి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్రం అలసత్వానికి నిరసనగానే తాము వారణాసిలో పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

వారణాసిలో పోటీ సందర్భంగా తాము ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని రైతులు తెలిపారు. పసుపుబోర్డు, మద్దతుధర కోసం తాము చేసిన పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతుగా వారణాసికి తమిళనాడుకు చెందిన రైతులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా తమకు మద్దతు తెలియజేయాలని కోరారు.

 

Similar News