అందాల అరకులో టెన్షన్‌ ఎవరికి...అటెన్షన్‌ ఎవరికి?

Update: 2019-05-11 00:35 GMT

కొండాకోనలు గలగలాపారే జలపాతాలు. అందమైన అరకు లోయ అందాలు. అంతేనా ఇక్కడ గిరిజనం రాజకీయం కూడా ప్రత్యేకమే. ఆరు మండలాలు కలిగిన అతిపెద్ద నియోజకవర్గం, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు పోటీ చేస్తున్న ప్రాంతం. ఆసక్తిగా మారుతున్న అరకు రాజకీయంలో, అధికారం అందుకోబోతున్నది ఎవరు. మన్యం వాసుల మనసు గెలుచుకోబోతున్నది ఏ పార్టీ. అరకు పోలటిక్స్ పై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం.

విశాఖ జిల్లా అరకు లోయ అందాలకు నెలవు మాత్రమే కాదు, ఆసక్తికర రాజకీయాలకు కేంద్ర బిందువు. అసలు విశాఖలోనే కనబడని రాజకీయ పార్టీలు అరకులోనే కనిపిస్తాయి. 2,20,773 మంది ఓటర్లు కలిగివున్న నియోకజవర్గం అరకు. అరకులోయ, డుండ్రీగూడ, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి మండలాలు కలిగి వున్న అరకులో, టీడిపి, వైసిపి మధ్య ప్రధాన పోరు సాగుతున్నప్పటికి, జనసేన, బీజేపి, ఆమ్‌ఆద్మీ, స్వతంత్రులు కూడా బరిలో నిలుస్తూ పోటీ ఇస్తున్నారు.

2009లో టీడిపి నుండి సివేరు సోమ, కాంగ్రెస్ అభ్యర్థిగా వంజంగి కాంతమ్మ, బీఎస్పీ, పీఆర్పీ, స్వతంత్రులు తలపడ్డారు. అయితే టీడిపి నుండి సివేరు సోమను విజయం వరించింది. 2014లో కూడా టీడిపి అభ్యర్ధిగా సివేరు సోమ పోటీ చేయగా, వైఎస్ఆర్సీపి నుంచి కిడారి సర్వేస్వరావు బరిలో నిలిచి 34 వేల ఓట్ల మెజరాటీ తో గెలుపొందారు. అయితే తరువాత పార్టీ మారి టీడిపి తీర్ధం పుచ్చుకుని ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. మావోయిస్టులు దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మేల్యే సివేరు సోమ మరణించడంతో అరకులో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. 2019 ఎన్నికల్లో టీడిపి నుంచి తండ్రి వారసత్వంతో కిడారి శ్రవణ్ పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థిగా శెట్టి ఫాల్గుణ బరిలో నిలిచారు.

అయితే కిడారి కుటుంబంపై సానుభూతితో పాటు శ్రవణ్ ఉన్నత విద్యావంతుడు అవ్వడం, పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు స్థానిక గిరిజనులకు అందించడంలో మంచి పేరు సాధించడంతో శ్రవణ్‌దే గెలుపంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే విశాఖ మన్యంలో 2014 ఎన్నికల్లో వైసిపి సత్తా చాటింది. శెట్టి ఫాల్గుణకు కూడా మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే విజయం తమదేనంటున్నారు వైసీపీ అభ్యర్థి. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది. టీడిపి సానుభూతిని సొంతం చేసుకుంటుందా, లేక వైసిపి జగన్ ప్రభంజనంతో విజయాన్ని అందుకుంటుందా. Full Viewఇదే ఇప్పుడు అరకు రాజకీయ ముఖచిత్రంలో హాట్ టాపిక్‌గా మారింది. 


Similar News