సమీపించిన మకరజ్యోతి దర్శన ఘడియలు...భక్తులతో కిటకిటలాడుతున్న శబరి గిరులు

శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చే ఘడియలు సమీపించాయి. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు మకరవిళక్కు అంటే మకర జ్యోతి దర్శనమిస్తుంది.

Update: 2019-01-14 11:36 GMT
Sabarimala

శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చే ఘడియలు సమీపించాయి. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు మకరవిళక్కు అంటే మకర జ్యోతి దర్శనమిస్తుంది. పొన్నాంబల మేడు కొండపై నుంచి అయ్యప్ప జ్యోతిరూపంలో దర్శనమిచ్చే ఘట్టాన్ని తిలకించేందుకు అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జ్యోతి దర్శనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పంబానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా దగ్గర ఏర్పాట్లు చేశారు. భక్తులకు భద్రత కల్పించడంతో పాటు తొక్కిసలాట జరుగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి.

మకర జ్యోతి దర్శనానికి రెండురోజుల క్రితం పందళం నుంచి బయల్దేరిన అయ్యప్పస్వామి తిరువాభరణాలను కాసేపట్లో శబరిమలలోని పవిత్ర పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. సరిగ్గా 6.30 గంటలకు దీపారాధన కార్యక్రమంతో పాటు, స్వామికి దివ్యాభరణాలు ధరింపజేసే 'తిరువాభరణ' ఘట్టం నిర్వహిస్తారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి హారతి ఇచ్చే సమయంలోనే ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది. జ్యోతి రూపంలో దర్శనమిచ్చే మణికంఠుణ్ణి చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మకరజ్యోతి దర్శనం చేసుకోవడాన్ని వేయి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. పర్వతగిరుల్లో కనిపించే జ్యోతిని చూడటానికి మాలలు ధరించిన స్వాములు లక్షల సంఖ్యలో శబరిమలలో వేచి చూస్తున్నారు. మకర జ్యోతి దర్శనం కోసం ఈ ఏడాది దాదాపు 18 లక్షల మందికిపైగా వచ్చి ఉంటారని అంచనా. ఇక మకర జ్యోతి దర్శం తర్వాత కూడా భక్తులు ఈనెల 19వ తేదీ వరకు శబరిగిరీశుణ్ణి దర్శించుకోవచ్చు. 20న పందల రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. 

Similar News