జమ్ములమడుగు టికెట్ రామసుబ్బారెడ్డికి కేటాయింపు

Update: 2019-02-09 05:41 GMT

కడప జిల్లా జమ్ములమడుగు సీటు పంచాయితిని సీఎం చంద్రబాబు పరిష్కరించారు. తన రాజనీతిని ప్రదర్శిస్తూ అటు రామసుబ్బారెడ్డి ఇటు మంత్రి ఆది వర్గాలను సంతృప్తి పరుస్తూ మధ్యే మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందుకు ఇరువురు నేతలు పరస్పర అంగీకారానికి వచ్చారు. దీంతో కడప జిల్లా జమ్ములమడుగు రాజకీయం కొలిక్కి వచ్చింది.

గత కొద్ది కాలంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జమ్ములమడుగు సీటు పంచాయితి కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టిన మంత్రి ఆది నారా‍యణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలు సీఎం చంద్రబాబు సూచన మేరకు ఇరువురు మధ్యేమార్గానికి అంగీకిరంచారు. దీని ప్రకారం జమ్ములమడుగు టికెట్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి దక్కింది. ఇదే సమయంలో మంత్రి ఆది నారాయణ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ పదవిని ఆది నారాయణ రెడ్డి కుటుంబంలోని ఒకరికి ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న మంత్రి ఆది నారాయణరెడ్డి టీడీపీ విజయాలు కడప నుంచే ప్రారంభమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌‌ను ఓడించడమే లక్ష్యంగా తామిద్దరం ప్రచారం చేస్తామని మంత్రి ప్రకటించారు. తమ మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వద్దనే పరిష్కరించుకుంటామన్నారు.

జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే తన లక్ష్యమని రామసుబ్బారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచన మేరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇరు కుటుంబాల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నా పార్టీ నిర్ణయం మేరకు కలిసి నడుస్తామని రామసుబ్బారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సూచనతో ఏకమైన ఇద్దరు నేతలు అనుచర వర్గాన్ని ఏకం చేసే పనిలో పడ్డారు. కడప కోటలో పసుపు జెండాను రెపరెపలాడించే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు తొలి అడుగుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. 

Similar News