పేదల బిల్లుకు పెద్దల ఆమోదం

ఈబీసీల రిజర్వేషన్ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదించింది.

Update: 2019-01-10 00:40 GMT
Rajya Sabha

ఈబీసీల రిజర్వేషన్ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదించింది. విపక్షాల సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ తిరస్కరణకు గురైంది.

ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. చారిత్రాత్మక 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల సూచించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోవడంతో లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలోనూ యథావిధిగా ఆమోదం పొందింది. ఈబీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఆర్టికల్ 15, 16లకు కేంద్రం అదనపు క్లాజ్‌లను జోడించింది. ఆర్టికల్ 15కి క్లాజ్ 6, ఆర్టికల్ 16కి క్లాజ్ 6ని జోడించింది.

ఈబీసీ బిల్లుకు పెద్దలసభలో మూడింట రెండొంతులపైగా సభ్యులు మద్దతిచ్చారు. సభకు మొత్తం 172 మంది సభ్యులు హాజరవగా165 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకంగా ఓటువేశారు. దాంతో ఈబీసీ బిల్లు పాసైందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు.

అంతకు ముందు ఈబీసీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనపై సభలో డిప్యూటీ ఛైర్మన్ ఓటింగ్ చేపట్టారు. కేవలం 18 మంది మాత్రమే ఓటు వేయడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ వర్తింపజేయాలన్న సవరణ ప్రతిపాదనను రాజ్యసభ తిరస్కరించింది. వీటితో పాటు మరికొన్ని సవరణ ప్రతిపాదనలు సైతం వీగిపోయాయి.

జనవరి 8న లోక్‌సభ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ బిల్లు త్వరలోనే రాష్ట్రపతి ముందుకు వెళ్లనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేసిన మరుక్షణమే చట్టరూపం దాల్చనుంది.

Similar News