నేడు పాలమూరులో ముఖ్యమంత్రి సభలు

Update: 2019-03-31 04:37 GMT

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ ఎన్నికల రణనినాదం మోగించబోతున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. గులాబీ బాస్ పాల్గొనే బహిరంగ సభలను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి

మొన్నటి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్..ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇవాళ సాయంత్రం వనపర్తి, మహబూబ్‌నగర్ సభల్లో పాల్గొంటున్నారు. వనపర్తిలో నాగవరం గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన మైదానంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఎన్నికల బహిరంగ సభ జరుగుతుంది. అలాగే మహబూబ్‌నగర్‌లోని భూత్‌పూర్ మండలం అమిస్తాపూర్ దగ్గర ఉన్న మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అమిస్తాపూర్ మైదానం వేదికగానే సీఎం కేసీఆర్ 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేపట్టి బహిరంగ సభలో ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు అదే వేదికపై నుంచి ఎన్నికల సందేశాన్ని వినిపించబోతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే సీఎం సభల ఏర్పాట్లను మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2లక్షలకు పైగా ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను సమావేశాలకు పెద్ద ఎత్తున తరలిచేందుకు సన్నాహలు చేస్తున్నారు. శుక్రవారం మహబూబ్ నగర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మోడీ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభలు వనపర్తి, మహబూబ్ నగర్‌‌లో సభలు జరుగుతునుండడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.

కేసీఆర్ ప్రతిరోజూ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు సభల్లో పాల్గొనేవిధంగా ఇప్పటికే షెడ్యూల్‌ను ఖరారయ్యింది. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభలన్నీ సాయంత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. 

Similar News