అగ్నిగుండంగా మారిన తెలంగాణ... 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు

Update: 2019-05-27 03:34 GMT

తెలంగాణ రాష్ట్రం రోజురోజుకు అగ్నిగుండంగా మారుతోంది. తెలంగాణ ప్రాంతంలో 121 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచలంలో 1952 జనవరి 29న 48.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది. దాని తరువాత రెండో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు హన్మకొండలో 1898 జనవరి 12న 47.8 డిగ్రీలుగా నమోదైంది. ఆదివారం మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 47.8 డిగ్రీలుండటంతో జనం అల్లాడిపోయారు.

రోహిణి కార్తె ఎంట్రీతో తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండల తీవ్రతకు వేడిగాలులు తోడయ్యాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో పలు జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని దీంతో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు, ఆపైన నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపటి వరకు వడగాల్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

అటు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం జిల్లాలతో పాటు చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలు గా నమోదైంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ్టి నుంచి జూన్ 2 వరకు ఎండల తీవ్రత అధికం కానుంది. మధ్యభారతం మీదుగా రాష్ట్రంపైకి పొడిగాలులు వీయడంతో ఒక్కసారిగా కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరిగాయి. దీనికితోడు కొమరన్‌ తీరం నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగడంతో వేడిగాలులు వీచాయని నిపుణులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో మధ్యభారతం పరిసరాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఆ ప్రభావంతో ఛత్తీ స్‌గఢ్‌, తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరుగుతాయని హెచ్చరించారు.  

Similar News