ఈ వారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు

Update: 2019-04-02 09:03 GMT

ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 43 డిగ్రీలు దాటాయి. ఈ వారంలో 45 ఢిగ్రీలపైనే నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అధికంగా ఉండే అవకాశముంది. ఉదయం 8 నుంచి భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక మధ్యాహ్నమైతే నెత్తిన నిప్పుల కుంపటి పెట్టుకున్నట్లు ఉంటోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో అత్యధిక వేడి ఉంటుందని, ఈ సమంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఈ వారంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం అలసట, బ్లడ్‌ ప్రెజర్‌లోనూ మార్పులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

డీహైడ్రేషన్‌, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ద్రవ పదార్థాలు తీసుకోవాలని, రోజుకు 3 లీటర్లు నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చల్లనీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. బయట ఎండ తీవ్రత పెరగడంతో రూమ్ టెంపరేచర్‌ కూడా పెరగనుంది. ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేషన్‌‌కు గురయ్యే ప్రమాదముంది. డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఇంట్లోను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News