'ఇబ్బందులున్నా 'సంక్షేమం' కొనసాగిస్తున్నాం'

Update: 2019-01-30 11:47 GMT

రాష్ట్రం విభజన నష్టాల నుంచి కోలుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా అవతరిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని... ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి రూ. 2 వేలు ఇస్తామని చెప్పారు. 11 బీసీల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 8 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చనున్నామని పేర్కొన్నారు. పింఛన్ల కోసం రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని,...ఆదరణ పథకం ద్వారా 90 శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామని గవర్నర్‌ తెలిపారు.

రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. పసుపు-కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తున్నామని రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నదుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయని గవర్నర్ చెప్పారు. కేంద్ర సహకారం లేకుండానే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.

రాష్ట్రానికి అత్యంత అన్యాయం జరిగినా అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని, గడచిన నాలుగున్నరేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై 10 శ్వేతపత్రాలను ఇటీవలే విడుదల చేశామని గవర్నర్ వెల్లడించారు. 

Similar News