గోదావరి ''బోటు'' ప్రమాదానికి ఏడాది పూర్తి..

Update: 2019-05-15 03:31 GMT

అధికారుల నిర్లక్ష్యానికి పాలకుల వైఫల్యం తోడయ్యి ... అభం శుభం తెలియని 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏడాది పూర్తయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం దగ్గర గోదావరి నదిలో పడవ మునిగి నేటికి సరిగ్గా ఏడాదైంది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఈ విషాధ ఘటన నుంచి కోలుకోలేకపోయారు. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది. నాటి ఘటన తమ జీవితంలో ఓ పీడకల అంటున్నారు ఇక్కడి స్థానికులు. తమతో ఆటలాడుతూ .. పాటలు పాడుతూ గడపిన 16 మంది చిన్నారులను దూరం చేసిన ఘటన ఎప్పటకీ మరచిపోలేమంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో .. . ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయక చర్యలు, మృతదేహాల వెలికితీత కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గోదావరి లోయలో గిరిజన గ్రామాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు యుద్దప్రాతిపాదికన పనులు పూర్తి చేయాలంటూ సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడంతో తమ బతుకులు మారుతాయని భావించిన వారికి ఇప్పటికీ నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామి కూడా నెరవేరలేదు. దుర్ఘటన జరిగి ఏడాదయినా గోదావరి తీర ప్రాంత వాసుల బతుకులు ఒక్క ఇంచు కూడా మారలేదు.ఇప్పటకీ అదే పడవలు ..అదే ప్రమాదకరమైన ప్రయాణాలు చేయాల్సిన దుస్థితిలో ఈ ప్రాంత వాసులు ఉన్నారు. అలలకు ఎదురేగి, కెరటాలను తట్టకుంటూ సొంతూరి ప్రయాణాలు సాగిస్తున్నారు.

Similar News