కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు..

Update: 2019-02-08 05:28 GMT

2019 లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ సర్కారు తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుశ్మితా దేవ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

ఢిల్లీలో జరిగిన మైనార్టీ డిపార్టుమెంట్ నేషనల్ కన్వెన్షన్‌లో కాంగ్రెస్ మహిళా విభాగం చీఫ్‌ సుస్మితా దేవ్‌ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ సర్కారు తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని సుస్మతా దేవ్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని చాలామంది తమతో చెప్పారని సుస్మిత తెలిపారు. కానీ ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లీం పురుషులపై బీజేపీకి ఆయుధమని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని, దీని వల్ల పోలీసుల వేధింపులు ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.

ముస్లిం పురుషులపై ముస్లిం మహిళలను ఈ బిల్లు ద్వారా రెచ్చగొట్టే వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు అమలైతే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెబుతున్నా ముస్లిం పురుషులను జైళ్లలో మగ్గేలా, వారిని పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం సాగించిన వేలాది ముస్లిం మహిళలను ఆమె అభినందించారు. సుశ్మితా దేవ్ ప్రకటన తర్వాత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

Similar News