జగన్‌ కోరితే బదిలీ చేయడమేంటి?: చంద్రబాబు

Update: 2019-03-27 05:34 GMT

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జగన్ కోరితే మోడీ-షాలు రాష్ట్ర అధికారులను బదిలీ చేయించడమేమిటని ఫైరయ్యారు. ఎన్నికలకు సంబంధం లేని వ్యవస్థ ఇంటెలిజెన్స్ అని, తన భద్రతను పర్యవేక్షించే అధికారిని కూడా బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నారు. ఏ కారణంతో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారో సమాధానం చెప్పాలని చంద్రబాబు కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ కుట్రలు పెరిగిపోతున్నా దేనికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గొద్దని సూచించారు. ప్రత్యర్థుల కుట్రల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రం, ఈసీ, తెలంగాణ ప్రభుత్వం, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ కూడా కుట్రలో భాగస్వామి అవుతుండటం దుర్మార్గమని ఆక్షేపించారు. ఎన్నికల సంఘంపైనా పోరాడే విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఇవాళ ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. 

Similar News