కిషన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారా..?

సున్నితమైన మనస్తత్వం ఉన్న రాజకీయనాయుకుడిగా బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి పేరుంది. కిషన్ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు అయితే తాజాగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో సయ్యద్ షుజా కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది.

Update: 2019-01-24 02:13 GMT

తెలంగాణ బీజేపీ కీలక రాజకీయనేతగా పేరున్న కిషన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారా..? సయ్యద్ షుజా చేసిన ఆరోపణలతో కిషన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయా..? ఈవీఎంల ట్యాంపరింగ్, 11 మంది హత్యకి సంబంధించిన వ్యవహారంలో కిషన్ పేరు రాడానికి కారణం ఏంటి..?

సున్నితమైన మనస్తత్వం ఉన్న రాజకీయనాయుకుడిగా బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి పేరుంది. కిషన్ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు అయితే తాజాగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో సయ్యద్ షుజా కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌లో కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు చేయడంతో ఆయన ఇరకాటంలో పడ్డాడు. ట్యాంపరింగ్ తో పాటు 11 మంది హత్యలతో కిషన్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేశాడు దీంతో ఈ విషయాలను కిషన్ సీరియస్ గా తీసుకున్నారు.

అయితే సయ్యద్‌ షుజా చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌, హ్యాకర్‌ సయ్యద్‌ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్‌ గాంధీ, సిబల్‌, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్‌ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి తాజా వ్యవహారంతో కిషన్ రెడ్డి పేరు చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డికి తాజా వ్యవహారం రాజకీయంగా మంచవుతుందా లేక పార్టీలో చెడ్డ పేరు తెచ్చిపెడుతుందా అన్నిది చూడాలి.

Similar News