ఐపీఎస్‌ల బదిలీలపై ముగిసిన వాదనలు

Update: 2019-03-28 12:20 GMT

ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాలు వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. కేరళ, మద్రాసు హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే, ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీని రద్దు చేస్తూ జీవో 720 తెచ్చారని ఈసీ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే సెక్షన్ 28 (ఏ) పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో డీజీ పేరును ప్రభుత్వమే ఇచ్చిందని ఈసీ తరపున లాయర్ వాదించారు. అయితే, పొరపాటున ఇంటెలిజెన్స్ డీజీ పేరును ఇచ్చామని ఏపీ అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తే డీజీ విషయంలోనే ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం అని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదులు వచ్చినందునే కడప, శ్రీకాకుళం ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని, ఈ విషయంలో పిటిషన్ వేసే అర్హత ఏపీ ప్రభుత్వానికి లేదని కోర్టుకు తెలిపారు. అసలు ఈ పిటిషనే విచారణకు అనర్హం అని పేర్కొన్నారు.

ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ కేసులో వైసీపీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో వారి తరఫు వాదనలను కూడా న్యాయమూర్తి అనుమతించారు. వైసీపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వాదనలను సావధానంగా విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

Similar News