వరుస సమీక్షలతో బిజీబిజీగా సీఎం వైఎస్ జగన్

Update: 2019-06-07 04:20 GMT

పూర్తి స్థాయి పాలనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. వరుస సమీక్షలతో వివిధ రంగాల పనితీరు తెలుసుకుంటున్నారు. కనీసం రోజుకు రెండు శాఖలపై సమీక్ష జరపాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని ప్రకారం ఆ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ రంగాల ప్రస్తుత పరిస్థితి, అధికారుల పనితీరు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందా ఆరా తీస్తున్నారు.

గురువారం వ్యవసాయ, నీటి పారుదల శాఖపై జగన్ సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల చలామణిపై సీరియస్ అయ్యారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి విత్తన చట్టం తీసుకొద్దామని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసాను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మధ్యాహ్నం నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళనకు సహకరించాలని ఇంజనీర్లను ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఖజానాకు నిధులు మిగిల్చే ఇంజనీర్లను ప్రజలందరి ముందు సన్మానిస్తామని మరోసారి ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరి జలాలను గరిష్టస్థాయిలో వినియోగించుకోవడం, పోలవరం ప్రాజెక్టు పనుల స్థితిగతులపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని చెప్పారు. సమీక్షల ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. తద్వారా పాలనపై పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Full View

Tags:    

Similar News