మిగిలింది 3 రోజులే.. సర్వ శక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులు

Update: 2019-04-07 04:31 GMT

మరో మూడ్రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. దీంతో ఈ చివరి సమయంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో పగటిపూట హోరాహోరీగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రచారం నిర్వహించని ప్రాంతా లపై దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన 'బూత్‌ మేనేజ్‌మెంట్‌'పై ప్రణాళికలు వేసుకుంటున్నారు.

పోలింగ్‌ సమీపించడంతో అభ్యర్థులు చివరి అస్త్రంగా ప్రలోభాలను ముమ్మరం చేశారు. పోటాపోటీగా ఓటర్లను డబ్బులు, మద్యం, కానుకలతో ముంచేస్తున్నారు. పోలింగ్‌కు మిగిలిన చివరి నాలుగు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హోరాహోరీగా పోటీ నెలకొన్నస్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలకుపైనే ముట్టజెప్పుతున్నారు. తెలంగాణలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో పోలింగ్‌ వేళలను తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్‌ జరగనుంది.

ఓటింగ్‌ శాతం తగ్గితే గెలుపోటములపై ప్రభావం ఉంటుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు బెంగపెట్టుకున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 73% పోలింగ్‌ నమోదు కాగా, హైదరాబాద్‌ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో 49% మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 55% పోలింగ్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏప్రిల్‌ 11న పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులందరూ ఓటర్లను వేడుకుంటున్నారు. పోలింగ్‌ శాతం పెరిగితే మెజారిటీ పెరుగుతుందని టీఆర్‌ఎస్, ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని బీజేపీ, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి.  

Similar News