రాజ్‌భవన్‌కు చేరిన ఏపీ రాజకీయం

Update: 2019-04-16 11:58 GMT

ఏపీ రాజకీయ దుమారం రాజ్‌భవన్‌కు చేరుకుంది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రేరేపించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏపీ సీఎస్, ఎన్నికల కమిషనర్‌పై బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రిటైర్డ్ ఐఏఎస్‌లు గవర్నర్‌ను కలవడంతో ఏపీలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత ఇది సదుమణుగక పోగా మరింత పెరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు దేశ వ్యాప్త పర్యటన చేస్తుంటే..విపక్షలతో పాటు రిటైర్డ్ ఉన్నతాధికారులు బాబు తీరును తప్పుబడుతున్నారు. చంద్రబాబునాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్నప్తి చేశారు.

వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రతినిధి బ్రుందం రాజభవన్‌లో గవర్నర్‌తో భేటీ అయింది. న‌ర్సరావుపేట, స‌త్తెన‌ప‌ల్లి, గుర‌జాల‌, కురుపాంల‌లో త‌మ కార్యక‌ర్తల‌పై టీడీపీ నేత‌లు దాడుల‌ చేసి.. కేసులు పెట్టి వేదిస్తున్నార‌ంటూ జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో తమ పార్టీ కార్యకర్తలను హింసకు గురి చేస్తున్నారని గవర్నర్‌కు చెప్పారు. టీడీపీకి ఓట్లు వేయలేదంటూ దళితులు, ముస్లింలపై దాడులు చేశారని గుర్తు చేశారు. శాంతిభద్రతలను గాలికొదిలేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు జగన్‌.

స్ట్రాంగ్‌రూమ్‌ల‌ను కేంద్ర బ‌ల‌గాల ఆధీనంలోకి తీసుకోవాల‌ని కోరిన జగన్‌ ఈవీఎంలపై బాబు అనుమానాల‌ను వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు. ఇవే ఈవీఎంల‌తో 2014లో చంద్రబాబు గెలిసిన సంగ‌తి మ‌రిచారా అంటు ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమ‌ణ్యం, ఈసీ గోపాల‌కృష్ణ ద్వివేదిల‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల‌పై గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐఏఎస్‌లు. అజ‌య్ క‌ల్లం, ఐవీఆర్ కృష్ణారావ్, గోపాల్‌రావ్‌ల‌తో కూడిన బృందం గ‌వ‌ర్నర్‌ను క‌లిసింది. నిజాయితీగా ప‌నిచేస్తున్న అధికారుల‌పై నిందారోప‌ణ‌లు చేయడాన్ని తప్పుబట్టారు. మూకుమ్మడి ఫిర్యాదు రాజ్‌భవన్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News