జాతి నిర్వచనంలో మతానిది కీలక పాత్ర... యుద్ధాలు పుట్టేది అందులోంచేనా?

Update: 2019-02-07 09:57 GMT

వివిధ దేశాల్లో ఇప్పుడు మతం కీలకపాత్ర పోషిస్తోంది. మతం వ్యవహారాల్లో ప్రభుత్వాల పాత్ర అధికమవుతోంది. మరో వైపున కొంతమందిలో పరమత అసహనం, స్వమత దురభిమానం పెరిగిపోతున్నది. ఇది మతాల మధ్య, దేశాల మధ్య, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య ఘర్షణలకు కారణమవుతోంది. అమెరికా, యూరప్ దేశాలు, భారత్, పాకిస్థాన్, మధ్యప్రాచ్య దేశాలు....ఏవీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సామాజికంగా మతానికి ప్రాధాన్యం పెరగుతున్న కొద్దీ వివిధ దేశాల్లో అశాంతి నెలకొంటున్నది.

ఒకప్పుడు రాజ్య విస్తరణ అనేది యుద్ధాల రూపంలో జరిగేది. ఇప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో మత విస్తరణ రూపంలో కూడా జరుగుతోంది. ఒక ప్రాంతంలో నిర్దిష్ట మతానికి చెందినవారి సంఖ్య అధికం కాగానే మతపరంగా ఉనికి చాటుకోవడం అధికమవుతున్నది. వివిధ కారణాలతో అలాంటి సందర్భాలను రాజ్యం సహించలేకపోతున్నది. దాంతో అణచివేతకు గురవుతున్నామనుకుంటున్న మతస్తుల్లో ప్రత్యేక రాజ్య భావనలు అధికమవుతున్నాయి. ఇదే కారణంతో చైనా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. మయన్మార్ లోనూ ఇదే జరుగుతోంది. పలు యూరప్ దేశాల్లో ముస్లింలు ప్రత్యేక వస్త్రధారణ పాటించడం అక్కడి సమాజాల్లో అశాంతికి కారణమవుతోంది. ఫ్రాన్స్ లాంటి దేశాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బహిరంగ స్థలాల్లో ప్రత్యేక మతపరమైన వేషధారణలపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు జాతి అంటే అందులో అన్ని మతాల వారికీ స్థానం ఉండేది. ఇప్పుడు మాత్రం జాతి నిర్వచనంలో మతం కీలకపాత్ర పోషించడం అధికమైపోతున్నది. ఒకే మతం లోని రెండు వర్గాల మధ్య కూడా పోరాటాలు జరుగుతున్నాయి. చాప కింద నీరులా మతపరమైన భావనలు విస్తరిస్తున్నాయి. మత ప్రచారంతో ఇతర మతస్తులను తమ మతాల్లో చేర్చుకోవడం అధికమైపోతున్నది. మత విస్తరణకు ఎంచుకునే తప్పుడు మార్గాలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయి. ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

ఒకప్పుడు భారత్ పరమత సహనానికి మారుపేరుగా నిలిచింది. చాలా సందర్భాల్లో పాలకుల మతం ఏదైనా సమాజంలోని అన్ని మతాల వారు శాంతియుత సహజీవనం చేశారు. ఇప్పుడు మాత్రం భారత్ లోనూ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. బ్రిటిష్ వారు రగిల్చిన చిచ్చు నేటికీ కొనసాగుతోంది. అన్ని వ్యవహారాల్లోనూ మతం కీలకంగా మారుతోంది. మతం పేరిట దాడులు జరుగుతున్నాయి. మరో వైపున మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదన్న భావన ఉంది. మైనారిటీ వర్గాలు సైతం తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న ధోరణిలో ఉన్నాయి. దాంతో అన్ని మతాల్లోనూ కొందరిలో పరమత అసహనం పెరిగిపోతోంది. అదే సమాజంలో అశాంతికి కారణమవుతోంది. ఒక వర్గం వారు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు చేసే ప్రయత్నాలు మరో వర్గంవారిలో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. వ్యక్తి జీవితంలో మతానికి ప్రాధాన్యం ఉండడం కాదనలేని సత్యం. మతానికి, దేశ సంస్కృతికి మధ్య ఉండే తేడాను గమనించాలి. మతం కన్నా దేశ సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు సంఘటితం అయ్యేందుకు మతం ఒక్కటే ఆధారం కాకూడదు. జాతి నిర్మాణానికి మతమే ప్రాతిపదిక అయితే అన్ని దేశాల్లోనూ మతపరమైన ఆంక్షలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే....రేపటి నాడు మూడో ప్రపంచయుద్ధానికి మతాలే కారణమవుతాయి.

Similar News