పార్లమెంట్‌ ఎన్నికలకు హస్తం ఆలోచన ఏంటి?

Update: 2019-02-13 11:35 GMT

పార్లమెంట్ ఎన్నికల కసరత్తును తెలంగాణ కాంగ్రెస్ వేగవంతం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా గాకుండా లోక్ సభ ఎన్నికలకు తొందరగానే అభ్యర్థులను ప్రకటించనుంది. ఎంపీ సీటుకు పోటీ చేసేవారి దరఖాస్తుల తేదిని పీసీపీ పొడిగించింది. ఈ నెల 15 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు సమీక్ష సమావేశాలు అభ్యర్థుల పేర్లను పరిశీలించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అభ్యర్థుల ప్రకటన అలస్యమవడమేననే భావన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవడంతో లోక్ సభ ఎన్నికలో అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేయవద్దని హైకమాండ్ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఈ నెల 14 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి పీసీసీ అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు 150కి పైగా దరఖాస్తులు గాంధీభవన్ కు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం దరఖాస్తులు వచ్చిన తర్వాత ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ నెల 17 న పరిశీలిస్తుంది. అర్హులైన వారి అప్లికేషన్ లను హైకమాండ్ కు 25 వ తేదీలోపు పంపించనునట్లు తెలుస్తుంది. ఈ నెల చివరి వారంలో అభ్యర్థుల పేర్లను హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.ఈ నెల 15 నుండి 17 వరకు మూడు రోజుల పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 15 న ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ ఇంచార్జ్ గా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి,నిజమాబాద్,వరంగల్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి.ఈ నెల 16 న సలీమ్ అహ్మద్ ఇంచార్జ్ గా ఉన్న నాగర్ కర్నూల్,మహబూబ్ నగర్,నల్గొండ,భువనగిరి,మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తారు. 17న బోస్ రాజు ఇంచార్జ్ గా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల,మెదక్,మల్కాజ్గిరి నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమీక్ష సమావేశాల్లో ఏ ఏ నియోజకవర్గాలో ఎవరు అభ్యర్థులుగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం సేకరించనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ కి కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రధానిగా ఉండి ఏమి చేయలేకపోయారనే ప్రచారాన్ని తీసికెళ్లితే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే నిరుద్యోగ సమస్యలు,రైతుల సమస్యలు పరిష్కరిస్తారని హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలో టి ఆర్ ఎస్ కు ఓటు వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుందనే ప్రచారాన్ని కాంగ్రెస్ చేయనుంది. రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో టి ఆర్ ఎస్ ఎంపీ లు ఉన్న విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలు చేస్తూ టి ఆర్ ఎస్ కు ఓట్లు పడకుండా ప్లాన్స్ వేస్తుంది. 

Similar News